- పరిస్థితి అదుపులోనే ఉందన్న ఎమ్మెల్యే గంటా
ఆనందపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9;
గంభీరం రిజర్వాయర్ లాంటి ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు పరిశీలిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. కుండపోత వర్షాల నేపథ్యంలో గంభీరం రిజర్వాయర్ నీటి మట్టాన్ని సోమవారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చుట్టూ పచ్చని కొండలతో నగరానికి దగ్గర్లో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారన్నారు. రిజర్వాయర్ వరకు ఉన్న అప్రోచ్ రోడ్డును జీవీఎంసీ సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. వర్షం కారణంగా జరిగిన నష్టం వివరాలను తెలుసుకోవడానికి నియోజకవర్గంలో పర్యటించానని వివరించారు. పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో కాజ్ వే లపైన వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడంతో పాటు సాధ్యమైనంతగా ఆస్తి, పంట నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు నియోజకవర్గంలో భారీ నష్టాలేవీ నమోదు కాలేదన్నారు. వలలు కొట్టుకుపోయి నష్టం జరిగినట్లు మత్స్యకారులు చెప్పారని, ఆ వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించానని వెల్లడించారు.