డ్రగ్స్‌, గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం

9/13/2024 10:37:19 PM


జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
 డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా జిల్లాను మార్చేందుకు, యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే వాటి వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీఓఆర్‌డీ) కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి.మహేశ్వర్ రెడ్డి తో కలసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర డ్రగ్స్‌ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి-అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నెంబర్  14446 పని చేస్తున్నదని పేర్కొన్నారు. తమ సమస్యలు, ఫిర్యాదులు ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ ను కూడా పూర్తిస్థాయిలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్జీవోల సహకారంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కేవి.మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సమావేశంలో ఆర్డీవోలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, డీఎస్పీలు సిహెచ్. వివేకానంద, శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ బి.మీనాక్షి, జిల్లా వ్యవసాయ అధికారి కే. శ్రీధర్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ, డ్రగ్ కంట్రోల్, విద్యాశాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్లు, రవాణా, ఆర్టీసీ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*