పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు.

9/18/2024 10:02:25 PM

రాజాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18: 
రాజాం మండలం పొగిరి గ్రామంలో వెయ్యేళ్ళ క్రిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుప్రక్కన  నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు.  ఊర్లో ఉన్న   వెయ్యేళ్ళ క్రిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు. ప్రాచీన కొవెలను పడగొట్టి కొత్తది కట్టారు. అక్కడి నందిని ఊరి ముందర కోనేటి గట్టు మీదకు తరలించారు.   శివలింగం అప్పటిదే ఉంచారు.  కోనేరు నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లే త్రోవలో ఒక దిబ్బ ఉంది. దాని మీద వెయ్యేళ్ళ నాటి కోవెల శిథిలాలు ఉన్నాయి.  వాటి ముందరే ఆధునిక కోవెల కట్టి అక్కడ పడి ఉన్న చాముండి విగ్రహాన్ని తిరిగి అందులో ప్రతిష్టించారు.  ఆ విగ్రహం కాకతీయుల దేవత కాకతికి చెందిన సప్త మాత్రుకలలోని చాముండి అని, రంగనాథం చెప్పారు.  పాత అగస్త్యేశ్వరాలయం, పాత చాముండి ఆలయం కాకతీయుల కాలంనాడే కట్టారని  ఆయన  నిర్ధారించారు.   పొగిరి వెయ్యేళ్ల కిందట శైవ క్షేత్ర మని, శక్తి స్థలమని రంగనాథం స్పష్ట పరిచారు.
        ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ చరిత్ర పరిశోధకుడు రామోజ్ హరగోపాల్ ఇవి 10, 12 శతాబ్దాలవిగా నిర్ధారించినట్లు రంగనాథం చెప్పారు.  విగ్రహాలకు రంగులు పూయడం వలన, పాత కోవెళ్ళు పడగొట్టడం వల్ల, చరిత్ర మసక బారిందని అన్నారు.  ఈ పర్యటనలో స్థానిక సంఘ సేవకుడు పారుపల్లి కిరణ్ కుమార్, గార సీతారత్నం, మజ్జి హరినాధరావు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*