అమ‌రావ‌తి స‌రే ... స్టీల్ ప్లాంట్ పై సెంట్‌మెంట్ లేదా

9/18/2024 10:36:22 PM


- అమ‌రావ‌తికి 24, స్టీల్ ప్లాంట్‌కు 64 గ్రామాల ప్ర‌జ‌ల త్యాగం
- ఆ త్యాగంలో నిజాయితీ ఉంది...ఇందులో వ్యాపారం ఉంది
- కూట‌మి స‌ర్కారును నిల‌దీస్తున్న ప్ర‌జాస్వామ్య వాదులు

విశాఖప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; ​
విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు.. కూటమి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో సెంటిమెంట్‌ పనిచేస్తున్నప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ అంశంలో కూడా పనిచేస్తుంది కదా అని ప్ర‌జాస్వామ్య‌వాదులు, కార్మ‌క సంఘ నేత‌లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. 
గతంలో స్టీల్‌ ప్లాంట్‌పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్‌ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘అమరావతి విషయంలో సెంటిమెంట్ పని చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా సెంటిమెంట్‌ పనిచేయాలి కదా?. అమరావతి సెంటిమెంట్‌తో ముడిపడిందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సెంటిమెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వారి సెంటిమెంట్. అమరావతికి 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే.. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల వారు భూములు త్యాగం చేశారు. చంద్రబాబు ఆలోచించి మాట్లాడాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవు. సొంత గనులు కేటాయించేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. లేదా స్టీల్ ప్లాంట్‌ను సేయిల్లో విలీనం చేయించాలి. స్టీల్ ప్లాంట్‌పై ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ మాటపై నిలబడాలి. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాణ త్యాగం, పోరాటాలు చేశారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్‌తో కూడుకున్నది అని దేశం మొత్తం గుర్తించింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళక ముందే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైంది’ అని చెప్పుకొచ్చారు. 

ఆగ‌ని నిర‌స‌న‌లు...

బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ లోపల కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్‌ ప్లాంట్‌ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్‌ కట్‌ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్‌ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.

Name*
Email*
Comment*