పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య

9/18/2024 10:42:16 PM


ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్బిఐ డెప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ 

విశాఖపట్నం- ఎక్స్ ప్రెస్ న్యూస్ ,సెప్టెంబర్ 18: 
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎస్బిఐ డెప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
దేశవ్యాప్తంగా ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. 
సిరిపురం వద్ద నున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిపాలన విభాగంలో ఎస్బిఐ డెప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, నాబార్డ్ డిడిఎం సామంత్ కుమార్, ఎల్డిఎం ఎం.శ్రీనివాస్, బ్యాంకు అధికారులు, విద్యార్థులు జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

కార్యక్రమం అనంతరం డీజిఎం మాట్లాడుతూ ఎన్పిఎస్ వాత్సల్య యోజన కింద తల్లిదండ్రులు పింఛను ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చని అన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది చాలా పెట్టుబడి ఎంపికలను కలిగి ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో ఏడాదికి కనీసం రూ. 1,000తో పెట్టుబడితో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవచ్చని ఆయన తెలిపారు. దీంతో సమాజంలోని అన్ని వర్గాలకు ఈ పథకం అందుబాటులోకి వస్తుందని, ఈ పథకం సమగ్రతను,ఆర్థిక భద్రతను ప్రోత్సహిస్తుందని వివరించారు. ఈ పథకం చిన్న మొత్తాల పథకమైనప్పటికీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, ఫలితాలు అమోఘమని స్పష్టం చేశారు. ఈ పథకంతో పిల్లల్లో పొదుపు అలవాటు కావడమే కాకుండా, వికసిత్ భారత్ @ 2047 నాటికి భారతదేశం ఆర్ధికంగా ఎదగాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి ఇది ఎంతగానో దోహదమవుతుందని ఆకాంక్షించారు. అన్ని జాతీయ బ్యాంకుల్లో దీన్ని ప్రారంభించుకోవచ్చని, దేశవ్యాప్తంగా అత్యధిక బ్రాంచులు కలిగిన ఎస్బిఐలో అత్యధికంగా ఖాతాలు తెరవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత మంచి పథకాన్ని మీకోసం కాకుండా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఆలోచన చేసి ఖాతాలు ప్రారంభించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.

ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం సామంత్ కుమార్, ఎల్డిఎం ఎం.శ్రీనివాస్,బ్యాంకు అధికారులు, విద్యార్థులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.

Name*
Email*
Comment*