ఎమ్మెల్యేలు, ఎంపీలు విజన్‌ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి: సీఎం చంద్రబాబు

9/18/2024 10:48:27 PM


మంగళగిరి :ఎక్స్ ప్రెస్ న్యూస్:
  రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పు.. రూ.లక్ష కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది, కేంద్రం నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా విజన్‌ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

‘‘అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఎక్కడా డబ్బులు లేవు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినా ధైర్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేంద్ర సహాయం వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తికి ఆక్సిజన్‌ లాంటిది. మూడు పార్టీల సమష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించాం. నా జీవితంలో ఎన్నడూ చూడని విజయమిది. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన వారు.. 11 సీట్లకే పరిమితమయ్యారు అదే ప్రజాస్వామ్యం’’ అని చంద్రబాబు అన్నారు.

తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే

కొంచెం ఆలస్యం కావొచ్చు కానీ, తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్‌ రద్దు చేసి జగన్‌ దుర్మార్గమైన పని చేశారని దుయ్యబట్టారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని, రెన్యువల్‌ చేయలేదని మండిపడ్డారు. వైకాపా హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టను, విచారణలు జరుగుతున్నాయన్న చంద్రబాబు.. అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని స్పష్టం చేశారు. అక్టోబరు మొదటివారంలో కొత్త మద్యం పాలసీ వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే రెండేళ్లలో పోలవరం ఫేజ్‌-1 పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అందిస్తామన్నారు. అమరావతికి నిధుల కొరత లేదని, ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Name*
Email*
Comment*