ముంచంగిపుట్టు- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
మండల పరిధిలో గల మారుమూల బూసిపుట్టు పంచాయతీ, కమ్మరిగొయ్యి గ్రామంలో నీటి కుంట, పైపులు మరమ్మత్తులు పూర్తి చేయకుండానే లక్ష 77 వేల రూపాయలు సదరు గుత్తేదారుడు నిధులు విడుదల చేసుకున్నట్లు కమ్మరిగొయి గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గ్రామస్తులు కే సింహాచలం, కే లలిత కుమారి, కే వేణుగోపాల్, కె పండన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలో గ్రావిటీ ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్న నీటి ట్యాంకు, పైపులు, కుళాయి, నీటి కుండి నిర్మాణ మరమ్మతులు నిమిత్తం గత ఏడాది గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదించమన్నారు. పంచాయితీ నిధులను లక్ష 77 వేల రూపాయల నిధులు నీటి వనరుల మరమ్మతులకు కేటాయించుటకు తీర్మానం చేయటం జరిగిందన్నారు. అయితే సదరు గుత్తేదారుడు మరమ్మతులు పనులు పూర్తవకుండానే ఆ నిధులు విడుదల చేసుకున్నట్లు ఈసారి జరిగిన గ్రామసభలో గ్రామస్తులకు తెలిసిందని వెల్లడించారు.
సుమారు పది రోజులుగా మరమ్మతు పనులో కూలీలుగా చేసిన వారికి కూడ కూలీ డబ్బులు ఇవ్వలేదని ఆవేదనే వ్యక్తం చేశారు.
పూర్తి నిధులు విడుదల చేసుకొని మరమ్మతు పనులు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టి గ్రావిటీ ద్వారా గ్రామంలో ఇంటింటికి కులాయి ఏర్పాటు చేసి నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ జేఈ సాయి కిరణ్ కు పాత్రికేయుడు వివరణ కోరగా సదరు గుత్తేదారుని తీసుకువచ్చి కమ్మరిగొయి గ్రామానికి వెళ్లి త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ చంద్రమ్మ, నారాయణ, కే లక్ష్మయ్య, కే బాలరాజు తదితరులు పాల్గొన్నారు.