- బాబు వస్తే ఒకటో తేదీనే జీతాలన్నారు?
- పదో తేదీ దాటినా ఆ జాడే లేదంటున్న ఉద్యోగులు
- పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన చందంగా
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
పదో తేదీ దాటినా సగం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జీతాలు పడకపోవడంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు ప్రభుత్వం కొలువుదీరిన మొదటి నెలలో మాత్రమే మొదటి తేదీన జీతాలు పడ్డాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఒకటో తేదీకి బదులు మూడు, నాలుగు…ఇలా పెంచుకుంటూ 10వ తేదీ నాటికి జీతాలు వేస్తున్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇందుకేనా జగన్ ప్రభుత్వాన్ని మార్చి, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నెలాఖరుకు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చింది. అయినప్పటికీ ఉద్యోగులందరికీ జీతాలు వేయలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇలా వుంటే, రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వుంటుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రభుత్వ పెద్దలు చెప్పడమే తప్ప, ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తోందనే సణుగుడు మొదలైంది. ఇదే రీతిలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆలస్యమైతే మాత్రం వ్యతిరేకత తెచ్చుకోడానికి పెద్ద సమయం పట్టదు. ఇంకా తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి కేవలం నాలుగు నెలలు మాత్రమే కావడంతో, కుదురుకోడానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు. అయితే కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికే తిప్పలు పడడం చూస్తే, ఇక డిమాండ్లను ఏ విధంగా ముందుకు తేవాలనే సంశయంలో పడే పరిస్థితి. ఒకటో తేదీ జీతాలు ఇస్తే, అదే మహాభాగ్యం అనుకునేలా కూటమి ప్రభుత్వం కూడా గతంలో జగన్ సర్కార్ మాదిరే చేసేలా వుందని ఉద్యోగులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందో మరి!