ప్రణాళికాబద్దంగా ధాన్యం సేకరణ

10/5/2024 11:19:41 PM


*జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5 :
జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై వివిధ శాఖల అధికారులుతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా, ధాన్యం సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్, కనీస మద్దతు ధర వంటి అంశాలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. 
ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాకు గాను, స్థానిక వినియోగం నిమిత్తం 1.04 లక్షల మెట్రిక్ టన్నులు పోను ఈ -పంట, ఈ - కేవైసీ ఆధారంగా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం నిర్ణయించుకున్నామని వివరించారు. అవసరమైన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2024–25 ఖరీఫ్ సీజన్లో గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,320 (75 కేజీలకు రూ.1,725)లుగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయించినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ - పంట కింద 3,59,616 ఎకరాలు నమోదు అయిందని, ఈ కేవైసీ 3,26,521 ఎకరాలకు పూర్తయిందని వివరించారు. ఈ- కేవైసీ లో రాష్ట్ర సగటును చేరుకోని మండలాలు రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
 సమావేశంలో శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు కే సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాధ స్వామి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావు, సివిల్ సప్లైస్ డిఎం శ్రీనివాసరావు, పలువురు అధికారులు హాజరయ్యారు.

Name*
Email*
Comment*