*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఆమదాలవలస, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5 :
ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. గ్రామంలోని పలువురు రైతుల పొలాలను స్వయంగా పరిశీలించి ఈ-పంట నమోదుతో సరిపోల్చి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకుల పనితీరు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. ఈ కేవైసీ నమోదు లోని లోటుపాట్లు గురించి అడిగి తెలుసుకుని రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.
డ్రోన్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పంటల బీమా సహా నష్ట పరిహారం, గిట్టుబాటు ధర, పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాలు అన్నీ ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయని అందుకే ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట ద్వారా తప్పని సరిగా నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని స్పష్టం చేశారు. ఈ పరిశీలనకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరాడ త్రినాధ స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ రజిని, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మెట్ట మోహన రావు, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సుధీర్, పలువురు సర్వేయర్లు, వీఆర్వోలు హాజరయ్యారు.