*రాష్ట్ర, జిల్లా విజన్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి చర్చ
*వివిధ అంశాలపై సలహాలు, సూచనలు అందజేసిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు
*2029 నాటికి విశాఖ రూపరేఖలు మారిపోయేలా కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని నిర్ణయం
విశాఖపట్టణం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించనున్న స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. జిల్లాలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాల సభ్యులు పలు అంశాలపై ఆచరణాత్మకమైన సలహాలు, సూచనలు అందజేశారు. 2047 నాటికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపీట వేయాలని, కొత్త ఆవిష్కరణలను స్వాగతించాలని, సాంకేతికతను మరింత పెంపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదేళ్లలో (2029 నాటికి) విశాఖపట్టణం రూపురేఖలు మారిపోయేలా వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలని, విద్య, యువత ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టించాలని, వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలను అవలంభించి ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఉండాలని, ఆధునిక విధానాలు అనుసరించాలని సభ్యులంతా సలహాలు, సూచనలు చేశారు.
సమావేశంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ముందుగా రాష్ట్ర, జిల్లా ప్లాన్ లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాల కాలం పూర్తికాబోతున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలకు చోటు కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, సుమారు 975 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని గుర్తు చేశారు. వాటి సమతౌల్యత దెబ్బతినకుండా భవిష్యత్తు కార్యాచరణలు రూపొందించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజిన్స్ ను గుర్తించి ప్రోత్సహకాలను అందించాల్సి ఉందని అన్నారు. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగ, వ్యాపార అవకాశాలను పెంపొందించేలా శిక్షణలు అందించాలని, వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ పంటల ప్రణాళికను రూపొందించాలని సూచించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టినట్లయితే భవిష్యత్తు లక్ష్యాలను త్వరతిగతిన చేరుకోగలమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూళన, శక్తి వనరుల పునరుత్పాదకత, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని కలెక్టర్ అన్నారు. ఎం.ఎస్.ఎం.ఈ. హబ్స్, టెక్నాలజీ సర్వీస్ హబ్ లను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలను అవలంభించాలని, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను వినియోగించాలని, మార్కెటింగ్ సదుపాయాలను విస్తృతం చేయాలని అభిప్రాయపడ్డారు. పూర్తి సేంద్రీయ ఆహార పంటలను ప్రోత్సహించటం ద్వారా మానవుల ఆరోగ్యం కాపాడుకోగలమని,, జీవన ప్రమాణాలను పెంచేందుకు అవకాశం కలుగుతుందని సూచించారు.
*2029 నాటికి విశాఖ రూపురేఖలు మారిపోవాలి
ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా 2029 నాటికి విశాఖపట్టణం రూపురేఖలు మారిపోయేలా కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉందని, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు సాగాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తన ప్రజెంటేషన్ లో భాగంగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీలో జిల్లా వాటా 9.15 శాతం ఉందని అది 15 శాతానికి పెరిగేలా అందరూ సమష్టి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చుతూ.. మౌలిక వసతులను కల్పిస్తూ ప్రజారోగ్యం, సంక్షేమం దృష్ట్యా మరిన్ని ఉత్తమ చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక సమస్యలను అధిగమిస్తూ... దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా సమ్మిళిత విధానాలతో కూడిన ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని భూమి వినియోగాన్ని పెంచాలని, విద్యా, వైద్య రంగంలో నాణ్యత పెరగాలని, యువతలో నైఫుణ్యం పెంచాలని, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పేర్కొంటూ కలెక్టర్ తన ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వివిధ రంగాల నిపుణులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల సభ్యుల నుంచి జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనలు స్వీకరించి నమోదు చేసుకున్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, సీపీవో శ్రీనివాసరావు, క్రెడాయ్, ఫిక్కీ, ఆర్.ఐ.ఎన్.ఎల్., వి-సెజ్, బెల్ తదితర సంస్థల ప్రతినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.