ప‌ల్లె పండుగ‌తో గ్రామాల‌కు పూర్వ‌వైభవం

10/18/2024 1:16:39 AM

ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌.
 
గార‌-వైజాగ్ ఎక్స్ ప్రెస్; అక్టోబర్ 17.

అభివృద్ధి పనులు చేపట్టి పల్లెలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి సర్కార్ తొలి అడుగు వేసింద‌ని పల్లె పండుగతో ఆ వైభ‌వం గ్రామాల‌కు వ‌స్తుంద‌ని శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్ అన్నారు. మండ‌లంలోని  శ్రీ‌కూర్మం, బ‌ల‌రాంపురం, గొంటి, రామ‌చంద్రాపురం గ్రామాల్లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ల‌ను ఎమ్మెల్యే శంక‌ర్ గురువారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌ట్లాడుతూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇదే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింద‌ని చెప్పారు. పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తీసుతొచ్చేలా ప‌ల్లె పండుగ సాగుతోంద‌ని వివ‌రించారు.. గ్రామాల అభివృద్ధికి కీలక అడుగు వేసింది సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నార‌న్నారు. గ‌త వైసీపీ పాల‌న‌లో గ్రామాల‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసి క‌నీస మౌళిక స‌దుపాయాలు కూడా క‌ల్పించక పోవ‌డంతో ప‌ల్లెలు క‌ళావిహీనంగా ఉండేద‌న్నారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితిలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఆగ‌స్టు 13న నిర్వ‌హించిన గ్రామ స‌భ‌ల్లో గుర్తించిన‌ ప‌నుల‌ను పూర్తి చేసేలా  గ్రామాల్లో అభివృద్ధి ప‌నులకు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ల్లెపండుగ‌కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఈ నెల 20 వరకు కొనసాగే వారోత్సవాల్లో ఈ 30 వేల పనులకు శంకుస్థాపనలు చేయించి, సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంద‌ని శంక‌ర్ తెలిపారు. నియోజక వర్గంలో సిసిరోడ్లు, బిటి రోడ్లు, నీటి సంరక్షణ ట్రెంచులు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మిస్తామన్నారు. ఉపాధి నిధులతో నియోజక వర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో రూ.32 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. గత పాలనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎవరో కూడా తెలీదని,  గ్రామ సభలు పెట్టిన సందర్భమే లేదన్నారు. ఇప్పుడు ప్రజలే తమకు ఏం కావాలో తీర్మానించుకుంటున్నారన్నారని ఎమ్మెల్యే శంక‌ర్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు, ఎంపీడీఓలు, రైతులు, గ్రామ‌స్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*