*ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో లబ్ధిపొందిన వారికి 2.0లో గృహ సంబంధిత పథకంలో అవకాశం ఉండదని, ఇప్పుడు మంజూరైన ఇళ్లను ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల లేఅవుట్ ఇన్ ఛార్జులు, ఇతర అధికారులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశకాలు జారీ చేశారు. అధికారులు, గుత్తేదార్లు సమన్వయంతో వ్యవహరించి లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, సొంత స్థలంలో కట్టుకునే వారు కూడా త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని హితవు పలికారు.
పీఎం ఆవాస్ యోజన 2.0 కోసం ఆలోచిస్తూ కొంతమంది లబ్ధిదారులు ముందుకు రావటం లేదని అధికారులు ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1.0లో లబ్ధి పొందిన వారికి 2.0లో అవకాశం రాదని, మార్పులు చేర్పులు ఉండబోవని స్పష్టం చేశారు. కొత్తవారికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు బాగా అర్థమయ్యేలా చెప్పాలని అధికారులు బాధ్యత తీసుకోవాలని, క్షేత్రస్థాయి అధికారులు క్షుణ్నంగా విడమరిచి చెప్పాలని, ఇప్పుడు మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఒప్పించాలన్నారు. ఉన్న నిధులను సద్వినియోగం చేసుకునేందుకు అందరూ చొరవ చూపాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పనుల్లో మరింత జోరు పెంచాలని, నిర్ణీత కాలంలోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పనులను చేయాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలని నిర్దేశించారు.