జమిలి ఎన్నికలకు జగన్ సిద్ధం

10/18/2024 2:10:55 AM


. శ్రేణులకు మాజీ సిఎం జగన్ దిశా నిర్దేశం

తాడేపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్; 
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. జమిలి ఎన్నికల పైన  పార్టీ శ్రేణులతో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తాజాగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెబుతూనే, జమిలి ఎన్నికలు వస్తాయని అంటున్నారని పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని వైయస్ జగన్ పేర్కొన్నారు. అన్ని కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, రాష్ట్రంలో సమస్యల పైన పోరాటాలు చేయాలని, చంద్రబాబు విధానాలపైన, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ధర్నాలు, నిరసనలు తెలపాలని జగన్ సూచించారు. తాడేపల్లి లో జరిగిన వైసీపీ సమావేశంలో జగన్ మాట్లాడారు.

జమిలి ఎన్నికలకు రెడీగా ఉండాలి 

బాధితుల పక్షాన నిలవాలని అలా చేస్తే ప్రజల్లో మనకు మంచి స్పందన వస్తుందన్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి అన్న జోష్ తో ప్రతి ఒక్కరూ పని చేయాలని జగన్ సూచించారు. వైసిపి ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో ఈరోజు జగన్ నిర్వహించిన సమావేశంలో జమిలి ఎన్నికలకు రెడీగా ఉండాలని చెప్పడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.
జగన్ వ్యాఖ్యలపై ఆసక్తి
ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యల కోసం బలంగా పనిచేయాలని రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అంతా సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.దాదాపు నెల రోజుల క్రితం జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అప్పుడు జమిలి ఎన్నికలపైన ఏ విధమైన ప్రకటన చేయని జగన్ ఇప్పుడు పార్టీ సమావేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపిన చంద్రబాబు
మరోవైపు జమిలి ఎన్నికల పైన టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలకు దేశమంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని, ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు.

 2027 ద్వితీయార్థంలోనే జరిగే అవకాశం
జమిలి ఎన్నికలపైన కేంద్రకాబినెట్ ఆమోదం పొందిన తర్వాత చంద్రబాబు జమిలి ఎన్నికలు పెడితే నష్టం ఏమిటని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలకు ఆయన తన సంపూర్ణ మద్దతుని తెలిపారు. ఇక మళ్లీ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉండగా జమిలి ఎన్నికలు గనుక వస్తే 2027 ద్వితీయార్థంలోనే జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలకు జగన్ సేన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.

Name*
Email*
Comment*