పారదర్శకంగా ఇసుక సరఫరా

10/18/2024 2:16:48 AM


గోపాలపెంట ఇసుక రీచ్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 
 
శ్రీకాకుళం, అక్టోబర్ 17:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గం గోపాలపెంట ఇసుక రీచ్ ను ప్రారంభించిన ఆయన మరో రెండు రోజుల్లో జిల్లాలో ఐదు చోట్ల కొత్త రీచ్ లను ప్రారంభించి పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఆయా రీచ్ లలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూలీల ద్వారా ఇసుక తవ్వకాలు చేయించి, ఒడ్డున ఉండే స్టాక్ పాయింట్ నకు ట్రాక్టర్ల ద్వారా చేరవేస్తామని చెప్పారు. అక్కడ నుంచి జెసిబిల సహాయంతో 24 గంటల పాటు అవసరం మేరకు రీచ్ లను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఇటీవల ఆరు ఇసుక రీచ్ లలో తవ్వకాల కోసం టెండర్లను పిలవగా పూర్తిస్థాయిలో బిడ్లిను దాఖలు చేయని వారిని అనర్హులుగా గుర్తించామని అన్నారు. కావలసినంత సమయం ఇచ్చినప్పటికీ వాహనాల వివరాలను ఇవ్వని, వర్క్ ఎప్పటికి పూర్తి చేస్తామనే సమాచారం ఇవ్వని, అలాగే అఫిడవిట్లు దాఖలు చేయని వారిని ప్రక్రియ నుంచి తప్పించామని చెప్పారు. ప్రభుత్వం 16వ తేదీ నుంచి ఇసుక రీచ్ లను ప్రారంభించాలని నిర్ణయించడంతో నామినేషన్ పద్ధతిపై గోపాలపెంట ఇసుక రీచ్ ను ప్రారంభించామని స్పష్టం చేశారు. పాత టెండర్లను రద్దు చేశామని త్వరలోనే రీ టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఎటువంటి ఆటంకం కలగకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.

Name*
Email*
Comment*