- డాక్టర్ డివిజి శంకరరావు
పార్వతీపురం: వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 7:
పార్వతీపురం మన్యం జిల్లా లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మృతిపట్ల రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ఆందోళన వ్యక్తం చేసారు. విద్యార్థుల మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మన్యం జిల్లా కలెక్టర్ ను కోరారు. మన్యం జిల్లా లో జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్ధితో పాటు, కురుపాం గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్ధి అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆశ్రమ పాఠశాల నిర్వహణ, నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారు.ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులు మృతిచెందిన పరిస్థితులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, మౌలిక సదుపాయాలతో పాటు దోమ తెరలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గిరిజన సంక్షేమ పాఠశాల లు, వసతి గృహాలలో ఎటువంటి చర్యలు చేపట్టారో సమగ్ర నివేదికలను అందజేయాలని పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు , విజయనగరం,అల్లూరి సీతారామరాజు ,శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఆయా జిల్లా లలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణ,విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై కలెక్టర్లు దృష్టి సారించాలని,రోజువారీ పర్యవేక్షణ జరపాలని వారు కోరారు.