- కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనకు శ్రీకారం
- అసెంబ్లీ సమావేశాలకు ముందే
.అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
మూడు పార్టీల్లోని నేతలు నిరీక్షిస్తున్న నామి నేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. రెండో విడత జాబితా పైన సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటికే పవన్ నుంచి రెండో జాబితా లో జనసేన నుంచి అవకాశం ఇచ్చే వారి పేర్లను సేకరించారు. బీజేపీ ముఖ్యల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతో, ఒకటి రెండు రోజుల్లోనే రెండో జాబితా విడుదల కానుంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా సచివాలయంలో పవన్ తో సమావేశం సమయంలోనూ ఈ జాబితా పైన చర్చకు వచ్చింది. జనసేన నుంచి పేర్లను సూచించాలని చంద్రబాబు కోరారు. పార్టీలో చర్చించి అందిస్తాని చెప్పిన పవన్ ఈ రోజు ఆ జాబితా చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. అదే విధంగా బీజేపీ నుంచి కొందరి పేర్లను చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తొలి జాబితాలో పేర్ల ప్రకటన తరువాత కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన కినుక వహించారు. దీంతో, పార్టీ కోసం పని చేసి నాటి అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొని.. జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ కోసం పోరాటం చేసి నష్టపోయిన వారికి పదవుల్లో తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ పలు సంఘాలకు కార్పోరేషన్లు .. డైరెక్టర్ల నియామకం పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సుమారు వందమందికి పైగా...
రెండో జాబితాలో దాదాపు 100 పోస్టుల వరకు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ లో పలువురు నేతలు పదవులు ఆశిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. తొలి జాబితాల డైరెక్టర్ల పదవులు కేటాయించిన వారిలో కొందరు తమకు ఆ పదవులు అవసరం లేదని.. పార్టీలో పని చేస్తామని ప్రకటించారు. దీంతో, ఈ సారి జాబితాను అన్ని కోణాల్లోనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. సీట్లు దక్కని సీనియర్లకు ఈ లిస్టులో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సమయంలో అంత కంటే ముందుగానే ఈ జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.