-కీలక ఆదేశాలు జారీ..!
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
ఏపీలో పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ నిర్బంధంపై దాఖలైన 6 హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. నిర్బంధంలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తల హక్కులు, చట్టాన్ని అమలు చేసే చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలు జింకల రామాంజనేయులు, తిరుపతి లోకేశ్, మునగాల హరీశ్వర్ రెడ్డి, నక్కిన శ్యామ్, దంపతులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి, మహ్మద్ ఖాజాబాషా తదితరులపై కేసులతో సహా అదుపులోకి తీసుకున్న వారి కుటుంబ సభ్యులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీరు తమ కుటుంబ సభ్యుల్ని మూడు నుండి నాలుగు రోజుల వరకు కోర్టు ముందు హాజరుపరచకుండా ఉంచారని కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధింపులకు, భౌతిక దాడులకు గురి చేస్తున్నట్లు, ఆహారం కూడా పెట్టలేదంటూ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించించింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులపై కోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణను షెడ్యూల్ చేసింది. అలాగే విచారణకు కోర్టుకు హాజరు కావాలని అడ్వకేట్ జనరల్‌కు సమన్లుపంపింది. అనంతరం విచారణలో సోషల్‌మీడియా అక్రమ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. అక్రమ నిర్బంధాలపై సంబంధిత పోలీస్‌స్టేషన్ల నుంచి సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ఈ రోజు వరకూ ఉన్న సీసీ ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్‌లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. పౌరస్వేచ్ఛను కాపాడటంలో తమకు బాద్యత ఉందని తెలిపింది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా? ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తామని పేర్కొంది.