- అసెంబ్లీ రూల్స్‌పై స్పీకర్ క్లారిటీ
- కొత్త ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 12:
‘నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. రోజుకి పది ప్రశ్నలకే సమయం సరిపోతుంది. జీరో హవర్స్‌లో హ్యాండ్ రైజ్ చేస్తే వారికి నేను అవకాశం ఇస్తాను’’ అని వర్క్ షాప్‌ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంతో ఉపయోగం
బడ్జెట్‌పై కొత్త సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే తిట్టాలి తిట్టించాలి అనే సంస్కృతి ఉండేదన్నారు. ఎవరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని తెలిపారు. ప్రతిపక్ష హోదా అనేది ఒక సర్టిఫికెట్ కాదని.. బడ్జెట్ అనేది ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటుంది కాబట్టి ఇటువంటి సమావేశాలు చంద్రబాబు నిర్వహిస్తున్నారని చెప్పారు.
నమ్మకాన్ని వమ్ము చేయం...
‘ఎమ్మెల్యేలుగా మాకొక ప్లాట్ ఫామ్‌ను కల్పించారు. రెండు లక్షల 50 వేల మంది మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయము. బడ్జెట్ మీద కొత్త సభ్యులకి ఎవరికీ అవగాహన ఉండదు. ఇప్పటి వరకు మేము చేసిన పనులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు. కొత్త సభ్యులందరూ కూడా ఈ అవగాహన సదస్సు ద్వారా చాలా నేర్చుకుంటామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.
ఎన్నో నేర్చుకుంటున్నాం: ఆదిరెడ్డి
గత ప్రభుత్వం లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవి లేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే కూడా మీడియా వద్ద మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. బడ్జెట్ మీద అవగాహన సదస్సు ద్వారా చాలా నేర్చుకుంటున్నామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నాశనం చేశారని విమర్శించారు.
ప్రతిపక్ష హోదా ఎందుకివ్వాలి: సోమిరెడ్డి
చంద్రబాబు హయాంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొత్తవి కాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 84 మంది కొత్త సభ్యులు వచ్చారన్నారు. బడ్జెట్లో ఏ అంశాలు ఉంటాయి, షార్ట్ నోటీస్ అంటే ఏమిటి, అసెంబ్లీలో ప్రశ్నలు ఏ విధంగా వేయాలి లాంటి విషయాలు కొత్త సభ్యులు తెలుస్తాయని అన్నారు. జగన్ ఒక పిరికిపంద అని.. చివరకు అవగాహన సదస్సు వచ్చేవారిని కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. సాక్షి ని ఎదురుగా పెట్టుకుని ఇంటిలో సెట్టింగ్ వేసుకుని జగన్ మాట్లాడుతున్నారన్నారు. జగన్ తరఫున గెలిచిన వారు కూడా ఇదేమి కర్మ అంటూ బాధపడుతున్నారని తెలిపారు. ఐదేళ్ల నుంచి జగన్ కనీసం ఒక ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదని.. విలేకరులు వేసే ప్రశ్నలను ఎదుర్కొనే దమ్ము లేదన్నారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ సభ్యులకు శిక్షణ కొనసాగింది. సభలో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 84 మంది, రెండోసారి ఎన్నికైనవారు 39 మంది ఉన్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించేంత వరకు ఉన్న ప్రక్రియపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం పట్ల నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.