- ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు’’ అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ.. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని... నిరంతరం నేర్చుకోవాలి... తెలుసుకోవాలని సూచించారు. ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు... కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో... ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు’’ అని సూచించారు.
అలాంటి చర్చలకు సభ వేదిక కావాలి
సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందన్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని.... వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలన్నారు.