ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం
ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్:
ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందించనుంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేసిన తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనతోపాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల సన్నద్ధత, పొత్తుల అవకాశాలపై పార్టీ కీలక నేతలంతా చర్చించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సుఖ్ విందర్ సింగ్ సుఖు, దీపా దాస్ మున్షి సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్ర రాజు, పళ్లం రాజు, రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. .
ఈసీకి లేఖ..
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అలాగే కౌంటింగ్‌కు సంబంధించిన డేటాలో ‘తీవ్రమైన వ్యత్యాసాలు’ ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ రాసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా విచారణ జరపాలని పార్టీ అభ్యర్థించింది.మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చూస్తూ.. అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ తన లేఖలోఓటర్లను ఏకపక్షంగా తొలగించిన ఈసీ.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా పార్టీ లేవనెత్తింది. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటనేది ఈసీ తెలపాలని కోరింది.
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రతికూలంగా రావడం రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదని, రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది, సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని ఖర్గే పేర్కొన్నారు.