- చిన్నారి మృతి
- 41 మందికి చికిత్స
- భయాందోళనలో బాధితులు
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
ఏపీలో చాప కింద నీరులో డయేరియా విస్తరిస్తోంది. విశాఖలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డయేరియాతో 41 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, డయేరియా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఓ చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని సమాచారం. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం చోటుచేసుకుంది. గడిచిన ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిల్లో చేరారు. వాంతులు, వీరోచనాలతో బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మంచి నీటి కొళాయి వద్ద మురుగు నీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ..‘డయేరియా ప్రబలిన ప్రాంతంలొ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. 41 మంది డయేరియా బారిన పడ్డారు. గీతిక అనే బాలిక డయేరియాతో చనిపోయిందని నిర్ధారించలేం.. వేరే కారణం ఏదైనా అవ్వచ్చు. ఏడుగురు డయేరియా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డయేరియా బాధితులకు డయాలసిస్ అవుతుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.