న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ కోస‌మే ప్రాజెక్టులు

11/29/2024 9:42:26 PM


. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

. వివిధ అంశాలపై చర్చించి.. ఆమోదించిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌, నవంబర్ 29 :- 
గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సమీక్షించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కలెక్టర్ ఛాంబర్లో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు. నూతనంగా చేపట్టాల్సిన పనులపై తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర సుందరీకరణ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజా ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకొని నూతన పనులు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కొంతమంది ఇటీవల మారినట్లు కంపెనీ సెక్రటరీ, సి.ఎఫ్.ఓ. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ముందు ఉంచగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ సెక్రటరీ అజెండా అంశాలను చదివి వినిపించారు. కొన్ని అంశాలను యథావిధిగా ఆమోదించిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్.. కొన్ని అంశాల్లో మార్పులు చెప్పారు. నగరంలో ముఖ్య కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ, తాగునీటి సదుపాయం మెరుగుదల, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యకలాపాలను వేగవంతం చేయాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారు. ఆమోదం మేరకు నూతన పనులను చేపట్టాలని, నిర్ణీత కాలంలో జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కంపెనీ సెక్రటరీ కుసుమాంబ, సి.ఎఫ్.ఓ. ఆనంద్, జీవీఎంసీ సి.ఈ. శివప్రసాద్ రాజు, ఏడీసీ వర్మ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*