- కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- వివిధ జిల్లా రహదారుల విస్తరణ, జాతీయ రహదారులుగా ఎప్ గ్రేడ్ చేయాలని వినతి
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్:
ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రహదారులకు మహర్దశ కల్పించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలుసుకొని, వినతిపత్రం అందజేసి, వాటి ప్రధాన్యతపై చర్చించారు. జిల్లా మీదుగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి - 16 ను నరసన్నపేట - ఇచ్ఛాపురం మధ్య 6 లైన్లకు విస్తరించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం మధ్య రహదారికి అనుబంధంగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలన్నారు. దీని కారణంగా విశాఖ ఎయిర్ పోర్టుకు సైతం సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. తద్వారా రాష్ట్ర పురోగతిలో భాగమయ్యే అవకాశం కల్పించాలన్నారు.
మెరుగైన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం..
కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం మధ్య ఉన్న సీఎస్పీ రోడ్డును జాతీయ రహదారిగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విన్నవించారు. దీని ద్వారా ఒడిశాలోని రాయగడ, ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ తో అనుసంధానం పెరుగుతుందని పేర్కొన్నారు. అలికాం - బత్తిలి రోడ్డు విస్తరణతో ఒడిశా లోని పర్లాకిమిడిని కలపవచ్చని గుర్తు చేశారు. అలాగే డీపీఎన్ రోడ్డు (డోల - పోలాకి - నౌపడ) ను విస్తరించడం ద్వారా నరసన్నపేట - నౌపడ - మూలపేట పోర్టు - మెళియాపుట్టి) మార్గంలో కీలక పురోగతి సాధించవచ్చని వివరించారు. దీని ద్వారా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు, రైతులకు మేలు చేకూర్చవచ్చని తెలియజేశారు. జిల్లా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రాధాన్యతగా భావిస్తానని.. రోడ్లు విస్తరణతో ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ నాయుడు కార్యాలయం వెల్లడించింది.