'ప్రసాద్' పథకంలో అరసవల్లిని ఎంపిక చేయాలి

11/29/2024 9:47:17 PM


- కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కోరిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- రూ.100 కోట్లతో సూర్య దేవాలయం సమగ్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

- తద్వారా పర్యాటక, జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ప్రతిపాదనలు అందజేత

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్: 
జిల్లాలోని ప్రముఖ  సూర్య దేవాలయం అరసవల్లిని మాస్టర్ ప్లాన్ అమలుతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ కోరారు. ఏటా ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనాలకు వస్తుంటారని, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకం తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక విస్తరణ పథకం (ప్రసాద్) లో ఎంపిక చేయడంతో పాటు రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను ఆయన టీడీపీ కి చెందిన ఎంపీలు ఎం.శ్రీభరత్ (విశాఖపట్నం), హరీష్ బాలయోగి (అమలాపురం), నాగరాజు (కర్నూల్), దగ్గుమాల ప్రసాదరావ్ (చిత్తూరు) లతో కలిసి ఢిల్లీలో శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే అతి పురాతన, ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి ఆలయ చరిత్ర, విశిష్టత, వాస్తు నైపుణ్యం, అభివృద్ధి ఆవశ్యకతను పర్యాటక మంత్రికి వివరించారు. చారిత్రకంగా 7వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో.. ఉత్తరాయణం, దక్షిణాయన కాలాల్లో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్ ను తాకడం ఇక్కడి ప్రత్యేకతని తెలియజేశారు. అయితే.. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల అవసరాలకు తగినట్లు సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీనిని గుర్తించి, రూ.100 కోట్లతో సూర్య దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రతిపాదనలను ఆయనకు అందజేశారు. ప్రసాద్ పథకంలో ఎంపిక చేయడం ద్వారా అటు పర్యాటక అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి, స్థానికులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కేటాయింపులపై కృతజ్ఞతలు..
మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.113.75 కోట్లు కేటాయించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అలాగే దేశంలో పర్యాటక అభివృద్ధికి రూ.2 వేల కోట్లు, పెన్నా నదిపై రూ.78 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు, గోదావరి నదీ తీరం సమగ్ర అభివృద్ధిని సూచించే అఖండ గోదావరి ప్రాజెక్టు (హేవ్లాక్ వంతెన, పుష్కర ఘాట్) కోసం రూ.94 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు నడిపించడంతో పాటు ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు.

Name*
Email*
Comment*