- జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30 :
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం కింద నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని తహశీల్దార్లు, ఈఓ పీఆర్డీలను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆర్జీఎస్ఏ కార్యక్రమంపై జెసీ, డీజీపీఓ, డిఎల్డీఓ,మండల తహశీల్దార్లు, ఈఓపీఆర్డీలతో శనివారం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద జిల్లాలో 80 గ్రామ పంచాయితీ భవన నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. అవన్నీ మంజూరయ్యాయని, కావున వెంటనే స్థలాలను గుర్తించాల్సి ఉందన్నారు. మండలంలోని తహశీల్దార్లు, ఈఓ పీఆర్డీలు దీనిపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలని, బుధవారం నాటికి స్థలాలను గుర్తించి నివేదికను తమకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, డిఎల్డీఓ స్థల సేకరణపై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థల సేకరణ పూర్తయితే రూ. 32 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణం కొరకు నమూనా ఉందని, ఆ విధంగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తేల్చిచెప్పారు. కావున గతంలో మీ పరిధిలో కోరిన పంచాయతీ భవన నిర్మాణాల కోసం అందరికీ అనుకూలమైన స్థలాన్ని త్వరగా గుర్తించి, వివరాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డిఎల్డీఓ ఎన్.ఆర్.రామారావు, మండల తహశీల్దార్లు, ఈఓపీఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.