పలాస మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

11/30/2024 10:27:35 PM

దూరం పెడుతున్నారని వైసీపీ కౌన్సిలర్ల ఆందోళన.

పోడియం ఎదుట నిరసన

సభ నుంచి వైసీపీ కౌన్సిలర్ల వాకౌట్

సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30: 
 పలాస కాశీబుగ్గ మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. శనివారం మునిసిపల్ సమావేశ మందిరం లో చైర్మన్ బల్ల. గిరిబాబు అధ్యకతన  కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే  వైసీపీ కౌన్సిలర్లు  మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.పలువురు వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ  వార్డుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తమను దూరం పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పోడియం  ముందుకు దూసుకు వచ్చి నిరసన తెలిపి బైఠాయించారు. మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లకు సర్థి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. అనంతరం వైసిపికి చెందిన కౌన్సిల్ సభ్యులు వాకౌట్ చేస్తూ సభ నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు. 23 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యులు పురపాలక సంఘ కార్యాలయంలో మెట్లు మార్గంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన కు దిగారు. కౌన్సిలర్ల అధికారాలు కాపాడాలి.వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు కౌన్సిల్ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం లేదని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వార్డులో కౌన్సిలర్ల కు‌ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.మున్సిపల్ అధికారుల అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. తమ వార్డులో మెప్మా ఆధ్వర్యంలో  జరిగే అభివృద్ధి పనులకు సైతం కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు 31 వార్డులను సమన్యాయంతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 
15వ ఫైనాన్స్ నిధుల వినియోగం పై కౌన్సిల్ సమావేశం లో అజెండాలో చేర్చకుండా  సభలో చర్చించకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.కౌన్సిల్ తీర్మానం అవసరం లేనప్పుడు నెలవారీ జరిగే మున్సిపల్ సాధారణ సభలు ఎందుకని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు తీరు మార నంత వరకు తాము పురపాలక సంఘంలో జరిగే సాధారణ సభలకు రాబోమని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి కౌన్సిలర్ల వాకౌట్ తో  అజెండా లోని  అంశాల పై చర్చ జరగలేదు.కొద్దిపాటి టిడిపి కౌన్సిలర్ల ఆమోదంతో అజెండా లోని అంశాలన్నింటిని ఏకగ్రీవంగా తీర్మానించారు.సభను అర్ధాంతరంగా ముగించేసి  అధికారులు చేతులు దులిపేసుకున్నారు.

Name*
Email*
Comment*