జి.సిగడాం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
మహాకవి,నవయుగ వైతాళికుడు "గురజాడ అప్పారావు ముత్యాల సరాలులో సంస్కరణవాదం" అనే అంశంపై జి.సిగడాం కె.జి.బి.వి తెలుగు ఉపాధ్యాయిని,ప్రముఖ పుస్తక రచయిత్రి లలితారెడ్డి ఇంటర్వ్యూను ఆకాశవాణి(ప్రసార భారతి) ఆదిలాబాద్ కేంద్రం శనివారం ప్రసారం చేసింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ రేడియో కేంద్రం అనౌన్సర్(ఆర్.జె) జి. జ్యోతి ఆధ్వర్యం వహించి తమ సుమధుర స్వరంతో ఇంటర్వ్యూ జరిపి సహకారాన్ని అందించారు. గురజాడ 109 వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది."పూర్ణమ్మ" గేయంలో "కాసుకు లోనై తల్లీ దండ్రి..నెనరూ న్యాయం విడనాడి.. పుత్తడిబొమ్మను పూర్ణమ్మను నొక.. ముదుసలి మొగుడికి ముడివేస్రీ .".అనే ఈ గేయాన్ని, అలాగే"కన్యక"లో "పట్టమేలే రాజు గర్వం.. మట్టిగలిసెను..కోటపేటలు కూలి..నక్కలకాటపట్లయి అమరె..పట్టమేలే రాజు పోయెను..మట్టిగలిసెను కోటపేటలు...పదం పద్యం పట్టినిలిచెన్..కీర్తులపకీర్తుల్..అంటూ గురజాడ రాసిన ఈ గేయాలను విశ్లేషించారు. ఇక "దేశభక్తి" గేయంలో"ఆకులందున అణగి మణగీ.. కవిత కోయిల పలకవలెనోయి..పలుకులను విని..దేశమందభిమానములు మొలకలెత్తవలెనోయి"అని గురజాడ పిలుపునిచ్చారంటూ వివరించారు.ఈ మహోన్నత గేయాలను ముత్యాలసరాలు అనే నూతన ఛoదస్సులో రాసి, సమాజంలో గూడుకట్టుకుని ఉన్న దూరాచారాలను రూపుమాపాలని ఆయన ఎలుగెత్తి చాటారని లలితా రెడ్డి తన ఇంటర్వ్యూలో వివరించారు. ఇలాంటి విభిన్నమైన అంశాన్ని ఎంచుకొని ఎంతో చక్కగా చాలా మంచి విషయాలను చెప్పిన లలితారెడ్డిని (ఆర్.జే) జి .జ్యోతి ప్రత్యేకంగా అభినందించారు.ఆమె అభ్యర్థన మేరకు మహిళలను జాగృతం చేసే ఓ మంచి పాటను ప్రసారం చేయడం విశేషం.
ఇలాంటి అరుదైన మంచి కార్యక్రమంలో లలితారెడ్డి పాల్గొన్నందుకు కె.జి.బి.వి ప్రిన్సిపాల్ ఐ. ప్రమీల, సిబ్బంది, తెరవే అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, కవిమిత్రులు ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి, అనౌన్సర్ జి.జ్యోతికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లలితారెడ్డి హరివిల్లు కవితా సంపుటి,లలిత కవితా పుష్పమాలికలు, లలిత కథాసాగరం అనే పుస్తకాలను, అలాగే వివిధ పత్రికల్లో ఎన్నో కవితలను రాసి మంచి గుర్తింపు పొందారు.