పథకాల్ని మించిన పుకార్లు

11/30/2024 10:44:51 PM


- ఏపీలో పోస్టాఫీసులకు మరింత పెరిగిన రద్దీ
- వ్య‌క్తిగ‌త ఖాత‌లలో డ‌బ్బులు జ‌మంటూ ప్ర‌చారం
- పోస్టాఫీసుల్లో ఖాతాలు తెర‌వ‌డానికి ప‌రుగులు

విశాఖ‌ప‌ట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  
ఏపీలో పోస్టాఫీసులకు జనం రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. సంక్షేమ పథకాల డబ్బులు ఈసారి బ్యాంకు ఖాతాలకు బదులు పోస్టాఫీసు ఖాతాల్లో పడతాయన్న పుకార్లతో జనం పోస్టాఫీసులకు మూడు రోజులుగా క్యూ కడుతున్నారు. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ మినహా మరే సంక్షేమ పథకాల డబ్బులూ ఖాతాల్లో జమ చేయడం లేదు. దీనిపై ఓ చర్చ జరుగుతుండగానే కొత్త పుకార్లు మొదలయ్యాయి. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాలు ఉండి సంక్షేమ పథకాల డబ్బులు అందుకుంటున్న వారు కూడా ప్రభుత్వం మారడంతో తమకు డబ్బులు రావేమో అన్న ఆందోళనతో ఇలా పోస్టాఫీసులో ఖాతాలు తెరిచేందుకు పరుగులు తీస్తున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్దాయిలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో చంద్రబాబు ఇకపై ఇచ్చే పథకాల డబ్బుల కోసం ఖాతాలు తెరుస్తున్నామని కొందరు, కేంద్రం మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తుందనే కారణంతో మరికొందరు పోస్టాఫీసులో అకౌంట్లు తెరిచేస్తున్నారు. 

రూ.200తో ఖాతా తెరుస్తామంటూ...

 పోస్టాఫీసుల్లో అకౌంట్ తెరవడానికి కేవలం 200 కడితే సరిపోతుంది. దీంతో 200 రూపాయలు పెట్టి కొత్తగా పోస్టాఫీసు అకౌంట్ తీసుకుంటే నష్టమేం ఉందన్న వాదన సంక్షేమ పథకాల లబ్ది దారుల నుంచి వినిపిస్తోంది. ఇదే కారణంతో పోస్టాఫీసులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదంతా అంతిమంగా పోస్టల్ శాఖపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్నడూ లేనంత స్దాయిలో వందల సంఖ్యలో జనం రోజూ కొత్త ఖాతాల కోసం తరలివస్తుండటంతో ఏపీలో ఏం జరుగుతోందనే కేంద్రం కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అసలే కూటమి సర్కార్ పథకాల పంపకాలు ఇంకా మొదలుపెట్టకపోవడంతో జనంలో ఉన్న భారీ అంచనాల వల్లే ఇలా జరుగుతోందన్న చర్చ నెలకొంది.  మరోవైపు ప్రభుత్వ అధికారులే ఇలా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల సొమ్ము పడని వారు పోస్టాఫీసు అకౌంట్లు తెరవాలని చెప్తున్నట్లు మరికొందరు లబ్దిదారులు చెప్తున్నారు. అయితే బ్యాంకు ఖాతా ఉండి దానికి ఆధార్ కూడా లింక్ అయి ఇప్పటికే పథకాల డబ్పులు పడుతున్న వారు కొత్తగా అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉండీ ఆధార్ లింక్ కాని వారు, అసలు అకౌంటే లేని వారు మాత్రమే పోస్టాఫీసు అకౌంట్ తీసుకోవాలని చెప్తున్నారు.

Name*
Email*
Comment*