విశాఖలో దారుణం

11/30/2024 10:45:59 PM


. మహిళలపై యాసిడ్ దాడి 
- కూట‌మి స‌ర్కారులో ఆగ‌ని దాడులు

విశాఖ‌ప‌ట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;   
మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వారికి ఎదురవుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విశాఖ ఐటీఐ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. రాత్రి బస్సు ప్రయాణం చేస్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్సుపై యాసిడ్ బాటిల్ విసిరాడు. యాసిడ్ కిటికీ పక్కన కూర్చున్న మహిళలపై పడటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సు ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. యాసిడ్ ప్రధానంగా బస్సు అద్దాలపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, బాధితులు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. యాసిడ్ దాడి మ‌హిళ‌లే లక్ష్యంగా చేశారా లేదా అజ్ఞాత వ్యక్తి అకతాయి పని చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుండి మహిళలపై దాడుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Name*
Email*
Comment*