. బెల్టుషాపులపై కఠిన చర్యలు
. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళిక
. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత
విజయనగరం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటి పారుదల, వైద్యారోగ్యం, విద్యుత్, రీ సర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలవల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భూముల ఫ్రీహోల్డ్ కు సంబంధించి సుమారు 490 ఎకరాలు వరకు అవకతవకలు జరిగినట్లు తేలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బెల్టుషాపులు ఎక్కడా లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వేసవిలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకూడదని, ఇప్పటినుంచే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని చెప్పారు. ధాన్యం తడిచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. తుఫాన్లు, వర్షాలు ఎక్కువగా కురిసేటప్పుడు త్రాగునీటి నిల్వ ట్యాంకులను వారానికోసారి శుభ్రం చేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు 1912కు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. ఇళ్లపై ఉన్న విద్యుత్ వైర్లు, వేలాడుతున్న వైర్లను తొలగించేందుకు సమగ్ర సర్వే నిర్వహించి, నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు, పోలీసు శాఖ ఆద్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి సాగును, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. దీనిలో భాగంగా ఈగల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో ప్రతీ జిల్లాలో ఈగల్ బృందాలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.9కోట్లను ఖర్చుచేయనుందని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.