కూట‌మిలో ‘జోగి’ బురద‌

12/18/2024 9:21:19 AM



- ప‌లాస ఎమ్మెల్యే గౌతు శిరిష గిల‌గిల 
- తాత‌ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంతోషం ఆవిరి
- వివ‌ర‌ణ‌లు, క్ష‌మాప‌ణ‌ల‌తో స‌త‌మ‌తం 
- ఆ వెంటే మంత్రి పార్థ‌సార‌థి కూడా

విశాఖ‌ప‌ట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;   ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ప‌లాస ఎమ్మెల్యే గౌతు శిరీష మెడ‌కు చుట్టుకుంది. త‌న తాత విగ్ర‌హావిష్క‌ర‌ణే క‌దా అని వెళ్తే మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి ర‌మేష్ రూపంలో బుస‌కొట్ట‌డంతో ఆమె దోషిగా నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. ఇంత ర‌చ్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం  వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌ ప్రత్యక్షమై  ఊరేగింపులో పాల్గొన‌డం, ఒకే వేదిక‌ను పంచుకోవ‌డ‌మే. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారని.. ఆయన్ను వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నూజివీడు గౌడసంఘం నేతలు  ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషతోపాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ తదితరులతో పాటు జోగి రమేశ్‌, గన్నవరం ఎంపీపీ, వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు. టీడీపీ నేతలతో కలిసి జోగి వాహనంపై నిలబడి ఊరేగింపులో పాల్గొనడమే గాక వేదికపై కూడా వారి సరసన కూర్చున్నారు.  ఇక అనగాని రవి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన కేసులో కీలక పాత్రధారి. ఇలాంటి వ్యక్తులను తమతోపాటు వేదికపై కూర్చోబెట్టుకోవడం ద్వారా టీడీపీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  దీంతో పార్టీ వర్గాలతో పాటు నిఘా వర్గాల నుంచీ సమాచారం సేకరించిన లోకేశ్‌.. కేంద్ర కార్యాలయ బాధ్యులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. పార్థసారథి, శిరీష నుంచి వివరణ కోరాలని వారిని ఆదేశించారు. అయితే కొనకళ్లను మాత్రం వివరణ అడగలేదు. దీనిపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు కొనకళ్ల సూచనతోనే నిర్వాహకులు జోగి రమేశ్‌ను పిలిచారని తాము విన్నామని, ఆయన్ను వివరణ కోరకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

పార్థసారథి క్షమాపణలు

నూజివీడు కార్యక్రమంపై వివాదం చెలరేగడంతోమంత్రి పార్థసారథి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ‘గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకతీతంగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జోగి రమేశ్‌ రావడం యాదృచ్ఛికంగా జరిగింది. కూటమి నేతలెవరూ ఆయన్ను ఆహ్వానించ లేదు. 

ఎవరెవరు వస్తున్నారో తెలియదు: శిరీష

ఎమ్మెల్యే గౌతు శిరీష నూజివీడు ఘటనపై ఒక వీడియోలో వివరణ ఇచ్చారు. ‘మా పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి, టీడీపీకి ఇబ్బంది కలిగించే ఏ చర్యనూ నేను తెలిసి చేయను. నూజివీడులో మా తాతగారి విగ్రహావిష్కరణకు నెల రోజుల క్రితమే అక్కడి గౌడ సంఘం పిలిచింది. నాతోపాటు ఇంకా ఎవరెవరిని పిలిచారో నిర్వాహకులు చెప్పలేదు. టీడీపీని, చంద్రబాబును ఎన్నికల ముందు విమర్శించిన వాళ్లు.. ఎన్నికల తర్వాత మా పార్టీలోకి వస్తామని ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిని పలాసలో టీడీపీ కార్యాలయం గేటు లోపలికి కూడా అడుగు పెట్టనివ్వడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ఏ చర్చ జరిగినా పార్టీ అధిష్ఠానం దృష్టికి ఆ విషయాలు తీసుకెళ్లేది నేనే. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీలోకి రావాలని అనుకున్నప్పుడు తీసుకోవద్దని నేను పార్టీ అధిష్ఠానాన్ని కోరాను. ఆమె చంద్రబాబు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత విమర్శలు చేశారన్న కోపంతో ఆమె చేరికను వ్యతిరేకించాను. పార్టీ విషయాల్లో ఇంత పట్టుదలగా ఉండే వ్యక్తిని నేను.. తెలిసి తప్పు చేయను. టీడీపీ సోషల్‌ మీడియా అంటే నాకు అభిమానం. వారికి కూడా ఇదే చెబుతున్నాను. ఇక ముందు ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే.. ఇంకా ఎవరెవరిని పిలిచారో తెలుసుకున్న తర్వాతే వెళ్తా’ అని ఆమె వివరించారు.

ఆహ్వాన పత్రికల్లో పేరున్నా చూసుకోరా..?

గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో గౌరవ అతిథులుగా పేర్కొన్న వారిలో జోగి రమేశ్‌ పేరు ఉంది. అది చూసినప్పుడైనా టీడీపీ నేతలు చూసి అప్రమత్తం కావలసి ఉన్నా అలా చేయకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. వాస్తవానికి మంత్రి పార్థసారథి, కొనకళ్ల నారాయణ సూచనల మేరకే జోగి పేరును ఆహ్వానపత్రికలో ముద్రించినట్లు సమాచారం. ఇది తెలుసుకోకుండా కార్యక్రమానికి వెళ్లామని చెప్పడం కేవలం తప్పించుకునే ప్రయత్నమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Name*
Email*
Comment*