. పార్లమెంట్ ప్రవేశ పెట్టిన బిల్లును సమర్థించిన టీడీపీ, వైసీపీలు
- అనుకూలం 269, ప్రతికూలం 198
ఢిల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; ఎట్టకేలకు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును మంగళవారం ప్రవేశ పెట్టారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును, అలాగే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశ పెట్టారు. చాలా కాలంగా జమిలి బిల్లుపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టడమైతే పూర్తయ్యింది. అయితే ఇది ఆమోదం పొందడంలోనే అసలు కథ వుంది. ఇదిలా వుండగా జిమిలి బిల్లుపై విపక్షాలు డివిజన్ కోరాయి. దీంతో కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. జేపీసీకి చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు రావడం గమనార్హం. ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడం విశేషం.
బిల్లుకు జై కొట్టిన కూటమి ఎంపీలు
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో వుంది. ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలు జమిలి బిల్లుకు మద్దతు ఇవ్వడంతో పెద్దగా ఆశ్చర్యం లేదు. అయితే వైసీపీ కూడా మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జేపీసీ నివేదిక తర్వాత తిరిగి బిల్లును తీసుకొస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బిల్లుపై విస్తృతమైన చర్చ జరగాలని మోదీ, అమిత్‌షా ఆకాంక్షించారు. ఈ రెండు బిల్లుల్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని, అందుకే వ్యతిరేకిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేనప్పుడు బిల్లు ఎలా తెస్తారని డీఎంకే ప్రశ్నించింది. అలాగే టీఎంసీ కూడా వ్యతిరేకించింది.