ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు 18: మండల కేంద్రం ఏనుగురాయి పంచాయతీ పరిధి సెల్లుం గ్రామ కొండపైన వరహ లక్ష్మినరసింహస్వామి ఆలయం నిర్మాణం చేపట్టేందుకు రహదారి నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విధులతో సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, స్థానిక సర్పంచ్, సిరగం నరసింహారావు, ఎంపీటీసీ ఎం సుబ్బలక్ష్మి భూమి పూజ చేశారు. రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుభద్ర మాట్లాడుతూ ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి నుంచి వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్లు మేర ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఆలయ నిర్మాణానికి గత వైసిపి ప్రభుత్వ హయంలోనే నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. రహదారి సౌకర్యం లేక నిర్మాణం పనులు మొదలు పెట్టలేదని ఆమె పేర్కొన్నారు. నిర్మాణ పనులు గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, యంత్రాల సహాయంతో చేపడతారన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన వెంటనే ఆలయ నిర్మాణం మొదలు పెడతారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వరాహ లక్ష్మీనరసింహస్వామి మాలాధారణ భక్తులతో పాటు దామోదరం తదితరులు పాల్గొన్నారు.