* సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకరి విష్ణుమూర్తి
పాడేరు వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు,19: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే విధి మండలంలో పలు పంచాయతీలలో గంజాయి పేరుతో గిరిజన యువతపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, వాటిని వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకరి విష్ణుమూర్తి మాట్లాడుతూ జీకే వీధి మండలంలో దారకొండ, గుమ్మురేవులు, దుప్పుల వాడ పంచాయతీల్లో పలు గ్రామాల్లో గిరిజన యువతపై గంజాయి రవాణాలో సంబంధం లేకున్నా గంజాయి రవాణాలో పాల్గొన్నారనే నెపంతో కేసులు పెడుతున్నారని, దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేసినప్పటికీ గత ప్రభుత్వం నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గంజాయి సాగుని నిలిపివేశారని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని తీసుకొన నిర్ణయాలకు స్థానిక ప్రజలు కట్టుబడి గంజాయి సాగు చేయడం పూర్తిగా విడిచిపెట్టారని అన్నారు. ఈ తరుణంలో ఎక్కడో జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని సంబంధం లేనటువంటి యువకులపై గంజాయి కేసులు బనాయించడం జరుగుతుందని మండిపడ్డారు. గంజాయి సాగుని పూర్తిగా విడిచిపెట్టి హార్టికల్చర్ పంటలపై అవగాహన పెంచుకొని సాగు చేస్తున్నారని అలానే వరి, రాగులు, కొర్రలు, సామలు, రాజ్మా కందులు, నారింజ, పప్పు దినుసులు, కాఫీలు, మిరియాలు, పసుపు, జీడిమామిడి, జాప్రా, పంటలను సాగు చేస్తూ గిరిజన ప్రజలు జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. ఇట్లాంటి తరుణంలో గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామానికి చెందిన సుంకరి బుజ్జిబాబు అనే వ్యక్తిని 13.08.2024 న రంపచోడవరం పోలీసులు గ్రామానికి చేరుకొని అగ్రికల్చర్ అధికారులమని చెప్పి మాట్లాడాలని పొలం నుండి తీసుకొచ్చి బలవంతంగా జీపు ఎక్కించుకొని గంజాయి వ్యాపారం చేస్తావా అని చెప్పి బలత్కారంగా స్టేషన్ ని తీసుకెళ్లి గంజాయి కేసు బనాయించడం జరిగిందని అన్నారు. అలానే దారకొండ పంచాయతీలో చిలకల మామిడి గ్రామానికి చెందిన కోర్ర నారాయణ కోసం కొంతమంది గ్రామానికి రాత్రి 9 గంటల సమయంలో వచ్చి చలి కాగుతున్న గుంట రాజు, కొర్రకర్ల ను నారాయణ కోసం అడగగా తను గ్రామంలో లేడని చెప్పడంతో సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లమని అడగతంతో వాళ్ళు తీసుకొని వెళ్తున్న తరుణంలో వీరు ఇద్దరినీ కూడా బలవంతంగా కారెక్కించుకొని మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. కోర్ర నారాయణను తీసుకువస్తే తప్ప మిమ్మల్ని విడిచిపెట్టమని లేకుంటే మీ మీద కూడా గంజాయి కేసు పెడతామని బెదిరించడంతో వారు గ్రామస్తులు సంప్రదించడం జరిగింది. గ్రామస్తులు కూడా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి మాట్లాడగా అదే జవాబు చెప్పడం జరిగింది. ఆయన cr.no.53/2023 కేసులో ఉన్నాడని అది 20.09.2023 న కేసులో ఉన్నాడని అన్నారు.ఆ కేసులో ఉన్న వాళ్ళకి కోర్ర నారాయణకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అలానే ఆ తేదిన నారాయణ గతంలో బనాయించిన అక్రమ కేసులో విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాడని మరి జైల్లో ఉన్న వ్యక్తి గంజాయి రవాణాలో ఎలా పాల్గొంటారని విష్ణుమూర్తి మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులు అమాయక గిరిజన ప్రజలపై అక్రమంగా బనాయనించడం వలన గిరిజన యువత జైళ్ళ పాలై కేసులు చుట్టూ తిరుగుతూ సంబంధంలేని విషయాల్లో బాధితులై జీవితాలు కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తిస్థాయిలో గంజాయి నిర్మూలన చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ప్రజలు కట్టుబడి ఉన్నారని కనుకనే గంజాయి సాగు నిలిపివేసామని తెలిపారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టడంతో యువత సంఘవిద్రోహ శక్తులుగా మారడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై అలానే అధికారులపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పొందుతారని ఆయన అన్నారు. కావున తక్షణమే సంబంధం లేకుండా ఉండే గంజాయి కేసులపై స్థానిక గిరిజన యువతను భాగస్వాములు చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు.ఇకనైనా ఈ అక్రమ కేసులు నిలిపివేయాలని యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజల్ని మమేకం చేసుకొని ఈ అంశంపై ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.