నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 19: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈఓ వి. సుబ్బారావు, నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు క్యాంప్ కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం, అన్నవరం దేవస్థానానికి ధత్తత ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి, నిర్వహణ మొదలైన అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు, మంగలి, చాకలి, స్వీపర్, వాచ్‌మెన్ మొదలైన సిబ్బంది జీతభత్యాలు అన్నవరం దేవస్థానం చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అన్నవరం సత్యదేవుని ఆలయం ఈఓ వి.సుబ్బారావు బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం సత్యదేవుని ఆలయ డిసి చంద్రశేఖర్, పి.ఆర్.ఓ కొండలరావు, సూపరింటెండెంట్ రమణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయ ఈవో దివ్యతేజ, ఆలయ అర్చకులు భద్రాచల రామం పాల్గొన్నారు.