ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ప్రోగ్రాం అధికారిగా ఎస్ రజనీకుమారిని నియమించినట్లు ప్రిన్సిపాల్ వి. శంకర్రావు తెలిపారు. ఈ కళాశాలలో రెండు యూనిట్లు కోరామని, ఒక దానిని ఇప్పుడు మంజూరు చేశారన్నారు. సుదీర్ఘకాలంగా కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలుగా విశేష సేవలు అందిస్తున్న రజనీకుమారిని పీఓగా నియమిస్తూ డా బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రోగ్రాం సమన్వయకర్త డా. డి వనజ ఉత్తర్వులను జారీ చేశారు. పీవో బాధ్యతలను శుక్రవారం చేపట్టినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ సందర్భంగా రజనీకుమారి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా సేవాగుణం, క్రమశిక్షణ అలవడతాయని, కొత్త ప్రాంతాల పరిచయాల ద్వారా విద్యార్థుల భవితకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ దిశగా తన వంతు సేవలందిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇతర అధ్యాపకులు రజనీకుమారిని అభినందించారు.