పీహెచ్ సీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్ మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ

12/21/2024 3:45:13 PM

కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20 :  వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. మండలంలో కూనేరు -రామభద్రపురం, కొమరాడ, పీహెచ్ సీలు, కుమ్మరిగుంట గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా  సీజనల్ వ్యాదులు, జ్వరాలు మండలంలో ఎక్కడైనా నమోదవుతున్నాయా, వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందని వైద్యాధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒపి, ఐపి, ల్యాబ్, పార్చురిషన్ రికార్డులు తనిఖీ చేసి ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షలు వివరాలు, నివేదికల ద్వారా వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. అక్కడ రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొమరాడ పిహెచ్సీలో అప్పుడే ప్రసవం జరిగిన తల్లీబిడ్డ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. డా. జగన్మోహన్ సిబ్బందితో సమీక్షించి గ్రామాల్లో  మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు ఎక్కడ నమోదు అయినా ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో విరివిగా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. త్రాగునీరు విషయమై ప్రజలను అప్రమత్తం చేయాలని, కాచి చల్లార్చిన నీటిని తీసుకునేలా అవగాహన కల్పించారు. నీటి స్వచ్ఛత పరీక్షలు నిర్వహించాలన్నారు. మారుమూల, గిరి శిఖర గ్రామాల్లో ప్రాథమికంగా అవసరమైన మందులు, పరీక్షలు అందుబాటులో ఉంచాలన్నారు. అక్కడ గర్భిణులను ప్రసవ గడువుకు నెల ముందుగానే గర్భిణీ వసతి గృహాల్లో చేర్చాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోగ్య సర్వేల తీరుపై ఆరా తీశారు. డా. బిఆర్ అంబేద్కర్ గురుకులం హాస్టల్ లో విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాల్లో, క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందజేయడంలో ప్రజలకు  ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. శిరీష, డా. శామ్యూల్, డా.గణేష్ పట్నాయక్, సిహెచ్ఓ బంగారుబాబు, ఎపిడిమిక్ ఈఓ సత్తిబాబు, సూపర్వైజర్స్ శోభ, శారద, నిర్మల, బద్రినారారాయణ, జయగౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*