టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పి తీరాల్సిందే
- పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గట్టిగా చెప్పారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ఓ బాధ్యత గల వ్యక్తిగా ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పానని, తానే క్షమాపణ చెప్పినప్పుడు మీరు కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, ఏఈవో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లు ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ బాధితుల ఆర్తనాధాలు వింటే బాధ ఏంటో అర్థమవుతుందని, ఈ సమయంలో క్షమాపణ చెప్పి తీరాలని, వేరే దారి లేదని అన్నారు. క్షమాపణ చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు రావు కాని, మీరు కోరే క్షమాపణతో ప్రజలు గౌరవంగా ఫీలవుతారన్నారు. గరుడ ఉత్సవాలకు నాలుగు లక్షల మంది వస్తే విజయవంతంగా నిర్వహించగా కేవలం 2500 మంది ఉన్న స్థలంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దురదృష్టకర ఘటన జరిగిందని అన్నారు.
హనీమూన్ పీరియడ్ అయిపోయింది
ఆరు నెలల హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇప్పటివరకూ అధికారులను కూర్చొబెట్టి సమీక్షలు నిర్వహించా. ఇకపై సక్రమంగా పనిచేయని అధికారులను సహించే లేదని ఎక్కడికక్కడా నిలదీతలే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు కూటమితో కలిసి ఉండాలని శక్తి పీఠం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్నానని అన్నారు. కానీ అధికార యంత్రాంగం సహకారం కావాలని కోరారు. ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని, తనకు అధికారం అలంకారం కాదని, బాధ్యతగా గుర్తించానని వెల్లడించారు. తిరుపతి పర్యటనలో తనను చూసి కేరింతలు, ఈలలు కొట్టడాన్ని తప్పుపడుతూ యువత సందర్భోచితంగా వ్యవహరించాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈవ్ టీచింగ్ అనేది మరోసారి కనిపించవద్దని, ఆ దిశగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.