ఆటలన్నీ "మామూ(ళ్ళే)లే" - హెచ్చరికలు బే ఖాతరు
అనపర్తి,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 15 :సంక్రాంతి పురస్కరించుకుని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఎప్పటిలానే పోలీసులు,ఇతర అధికారులు హెచ్చరించడం యధావిధిగా కోడి పందాలు, పేకాట,గుండాట, స్కిల్ గేమ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.దీంతో తూర్పుగోదావరి జిల్లాలో కొట్లాది రూపాయలు చేతులు మారాయి.జూదాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిరోధించాల్సిన అధికారులు తమకు అందిన "మాముళ్ళు"అందడంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంక్రాంతి సందర్భంగా సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు తమ ఇంటి యజమానులు పందాలు,జూదాల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని రావడంతో ఉసూరుమంటూ పండగ పర్వదినాన ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైకి మాత్రం ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసే వారి కళ్ళెదుటే అన్నీ యథాపరంగా కొనసాగుతున్న కళ్ళు లేని కబోదిలా వ్యవహరించడం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.అసలు పండగంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎందుకు పరోక్షంగా అనుమతి ఇస్తున్నారో అర్థం కావడం లేదని తమకు ఏదో ముట్ట చెప్పారు కదాని చూసీచూడనట్లు వ్యవహరించడం సరైన విధానం కాదని ఇటువంటివి నిరోధించాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ వారి పని వారిదే మా పని మాదే అన్న రీతిలో వ్యవహారం జరుగుతుందనే పలువురు విమర్శిస్తున్నారు.ఇంట్లో మహిళల బంగారాలు సైతం తాకట్టుపెట్టి ఆ డబ్బు కోడిపందాలు, పేకాట గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెట్టడం అందులో ఓడిపోయి ఉన్నది పోగొట్టుకుని ఉత్సాహంగా ఉండవలసిన కుటుంబాలు పండగ పూట ఉసూరుమంటూ విలపిస్తూ పస్తు పడుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించగా అమాయకులు మాత్రం బలైపోతున్నారని అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన సంబంధింత అధికారులు లంచాలుకు స్వస్తి చెప్పి ఇటువంటి కార్యక్రమాలను ఆపే బాధ్యత నిక్కచ్చిగా నిర్వహించాలని ప్రజలు ముఖ్యంగా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు