ఎదురులేని కేజ్రీవాల్
. నాలుగోసారి బరిలో
. ఫిబ్రవరి 5న పోలింగ్
. నామినేషన్ దాఖలు
ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముణ పోరు నెలకొంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆ రోజు నుంచి నామనేషన్లను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 17. ఈ పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి కిందటే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు పని చేసే పార్టీ, మరోవైపు అబద్దాలు చెబుతూ, బురదచల్లే పార్టీ ఎన్నికల రణరంగంలో ఎదురెదురుగా నిలిచాయని, దేనికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కోరారు. తమ హయాంలో ఢిల్లీ-.నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో చోటు చేసుకున్న అభివృద్ధి పనులను ఒక్కసారి చూడాలని ఓటర్లను కోరారు అరవింద్ కేజ్రీవాల్. రోడ్లు, మంచినీరు, విద్యుత్, విద్య, వైద్యం రంగాలను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి కార్యకలాపాలకు బ్రేక్ పడనివ్వొద్దని సూచించారు. బీజేపీకి కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లేడని ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు కేజ్రీవాల్. ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచీ గెలుస్తూనే వస్తోన్నారు. 2013, 2015, 2020ల్లో ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీలో నిలిచారు.